టుడే రిలీజ్ మణిరత్నం 'రావణ్' కథ ఏమిటంటే...

Friday, June 18, 2010
విక్రమ్, పృధ్వీరాజ్, ఐశ్వర్య రాయ్ ప్రధానపాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చిత్రం రావణ్ ఈ రోజు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం కథ ప్రకారం... వీరయ్య (విక్రమ్‌) గిరిజనుడు...ఓ వర్గం నాయకుడు. తన మాటే చెల్లుబాటు కావాలనుకొనే వ్యక్తి. తనున్న ఊరిలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూంటాడు. అక్కడ పోలీస్ వ్యవస్ధ అనేది నామమాత్రంగా పనిచేస్తూంటుంది. మరో ప్రక్క పోలీస్ ఆఫీసర్ దేవ్‌ప్రసాద్ (పృధ్వీ) క్లాసికల్ డాన్సర్ రాగిణి(ఐశ్వర్య రాయ్)తో ప్రేమలో పడి పెళ్ళిచేసుకుంటాడు. ఆతర్వాత ట్రాన్సఫరై వీరయ్య ఉండే టౌన్ కి వెళ్ళతాడు.ఈ క్రమంలో వీరయ్యకీ పోలీసు అధికారి దేవ్‌ ప్రసాద్‌ (పృథ్వీరాజ్‌)కీ నడుమ శత్రుత్వం ఏర్పడుతుంది. ఆధిపత్య పోరు మొదలవుతుంది.

అక్కడ పరిస్ధితులు గమనించిన దేవ్..అక్కడ వారి నాయకుడు వీరాని మట్టుపెడ్తే సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని భావించి..పోరాటం ప్రారంభిస్తాడు. వీరా..మనిషి ప్రియమణి దేవ్ ప్రసాద్ చేతిలో మరణిస్తుంది. దెబ్బ తిన్న వీరా...దేవ్ భార్య రాగిణిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకుపోతాడు. ఆమెని వెతుక్కుంటూ దేవ్ బయిలుదేరతాడు. ఆ అడవి చాలా కన్ఫూజింగ్ గా భయపెట్టదిగా, దట్టంగా ఉంటుంది. ఆ క్రమంలో రకరకాల సంఘటనలు ఎదుర్కోవాల్సివస్తుంది. అతనికి త్రాగుబోతు పారెస్ట్ గార్డు (గోవిందా) సాయిపడతాడు. ఎదురైన పరిస్థితులు ఏమిటనేవి ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఈ చిత్రంలో ప్రియమణి, ప్రభు, కార్తీక్ కీలక పాత్రలను పోషించారు. మద్రాస్ టాకీస్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమైంది.

రామాయణానికి మణిరత్నం కొత్తగా చెప్పిన భాష్యం అని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆయన గురు తరవాత రూపొందించిన చిత్రమిది. కేరళ, కర్ణాటక అడవుల్లో చిత్రించిన సన్నివేశాలు, రెహమాన్‌ సంగీతం, సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణలు. "ఏది మంచి? ఏది చెడు? అనే మీమాంశల నడుమ సాగే కథ ఇది. ఇందులో రామాయణం, భారతం...నేటి సమాజం అన్నీ ఉంటాయి. ఈ కథలో ఎవరు రాముడు? ఎవరు రావణుడు? అనేది తెర మీద చూస్తేనే అర్థమవుతుంది" అన్నారు విక్రమ్‌. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం సమకూర్చిన చివరి చిత్రమిదే కావటం తెలుగువారికి మరో విశేషం.

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates