అభిమానులకి హీరోలు..ప్రభుత్వానికి విలన్లు..!

Tuesday, May 4, 2010
హీరోల రెమ్యూనరేషన్లు ఆకాశాన్నంటుతున్నాయని ఓవైపు ప్రొడ్యూసర్లు ఆరోపణలు చేస్తున్నారు. తమ వలనే కదా ప్రాజెక్ట్ మార్కెట్ అయ్యేదని మరోవైపు హీరోలు చెప్పకనే చెబుతున్నారు. అయితే ఆ సమస్య ఇచ్చిపుచ్చుకునే వాళ్ళది మాత్రమే. ప్రజలది, ప్రభుత్వానిదీ కాదు. విశేషం ఏంటంటే పరిశ్రమలోని వ్యక్తులు వాళ్ళల్లో వాళ్లు గొడవలు పడుతున్నారే తప్ప ప్రభుత్వాన్ని ఎంత మోసం చేస్తున్నారనే అంశాన్ని ఏమాత్రం బయటికి రానివ్వట్లేదు. హీరోల పారితోషికాలు పెరిగిపోయాయని రాద్ధాంతం చేస్తున్న నిర్మాతలలో ఏ ఒక్కరైనా ఫలానా హీరోకి, ఫలానా సినిమాకి మే ఇంత ఇచ్చాం అనేది బహిరంగంగా చెప్పగలరా? చెప్పలేరు!

ఎందుకంటే ఇచ్చేదాంట్లో సగం మాత్రమే లెక్కల్లో కనిపిస్తుంది మిగిలిన సగం బ్లాక్ మనీయే కాబట్టి! ఈ రోజున సినిమాకి ఏడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే కొందరు స్టార్ హీరోస్ మూడు వైటు, నాలుగు బ్లాకు ఇవ్వమని అడిగి మరీ తీసుకుంటున్నారట. ఇంతకీ ఇలా నల్లధనం పుచ్చుకునేది ఎందుకో అందరికీ తెలిసిందే! ఆదాయపు పన్ను తగ్గించుకోవడానికి, ఆత్మీయుల పేర్లతో ఆస్తులు పెంచుకోవడానికి!

ప్రస్తుతం నిర్మాతల మండలి ఆశిస్తున్నట్టుగా ఏ హీరోకి మూడున్నర కోట్లకి మించి పారితోషకం ఇవ్వరాదనే నిర్ణయం అమల్లోకి వచ్చినా ఈ బ్లాక్ అండ్ వైట్ సిస్టమ్ లో హీరోలకీ దక్కాల్సిన మొత్తం దక్కుతూనే వుంటుంది. ప్రతి హీరోకి ఓన్ బేనర్ వున్న నేపథ్యంలో బయటి నిర్మాతకి సినిమా చెయ్యాలంటే వాళ్లు అడిగినంత ఇచ్చి తీరాల్సిందే మరి. అయితే ఆదాయపు పన్ను రూపంలో ప్రభువ్వ ఖజానాకు చేరి దేశాభివద్దికై ఉపయోగపడాల్సిన డబ్బుకి ఇలా నల్లరంగు పులిమేసి తమ తరతరాల భవిత కోసం దాచిపెట్టెయ్యాలను కోవడం విలనిజమే కదా. ఇక్కడ ఆ విలనిజం ప్రదర్శిస్తోన్న వారిలో లక్షలాది ప్రేక్షకులకు అభిమాన హీరోలుగా చెలామణీ అవుతోన్న వ్యక్తులూ వుండడమే శోచనీయం. ఇదంతా చూస్తుంటే తెరపై త్యాగాలు చేసేసే హీరోలు తెరచాటున స్వార్ధం మాత్రమే చూసుకుంటారా..!?

0 comments:

Post a Comment

 
Entertainment News © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates