సినిమా పరిశ్రమ పచ్చగా వుంటే పది మంది సంతోషంగా వుంటారు. పచ్చగా అంటే ప్రతి నిర్మాత ఇంటి ముందు మొక్కలు పెంచాలని కాదు. ప్రతి హీరో రెగ్యులర్ గా సినిమాలు చేయాలి. అప్పుడే అందరికీ పని దొరుకుతుంది. లక్షలాది మందికి మూడు పూట్ల కడుపు నింపుకొంటున్నారు. సినిమాను నమ్ముకుని చెడిపోయాం అనుకునే వారు తగ్గిపోయి ఈ కళామతల్లికి కోటి దండాలు అనేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. యన్ టి ఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్, చంద్రమోహన్, మోహన్ బాబు తదితర సీనియర్ నటులంతా వందల కొద్దీ సినిమాలు చేసారంటే కారణం కష్టపడే తత్వం. అయితే నేటి తరం కథానాయకులు ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులొచ్చాయి అనిపిస్తోంది. అగ్ర కథానాయకులు బాలకృష్ణ , నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ , రవితేజ, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర హీరోలంగా షూటింగ్ లతో బిజీగా వున్నారు. ఇంతమంది హీరోలు ఒకే సారి షూటింగ్ లలో బిజీగా వుండటం ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఏ హీరోని చూసినా షూటింగ్ లో బిజీగా వున్నారనే వార్త పరిశ్రమను పులకింపజేస్తోంది.
యునైటెడ్ మూవీస్ పతాకం పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరుచూరి కిరిటీ నిర్మిస్తున్న ‘సింహా’ బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండగా, ‘ఆకాశమంత’ ఫేం రాధామోహన్ దర్శకత్వంలో దిల్ రాజు, ప్రకాష్ రాజ్ లు సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ లోనాగార్జున బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ‘పులి’, మహేష్ బాబు చిత్రం షూటింగ్స్ ముగింపు దశకు చేరుకు న్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ‘బృందావనం’ చిత్రం షూటింగ్‌లో యన్‌టిఆర్ పాల్గొంటున్నారు. రామ్ చరణ్ ‘ఆరెంజ్’ చిత్రం షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అల్లు అర్జున్ ‘వరుడు’ షూటింగ్ పూర్తయింది. ‘వేదం’ 80శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. అలాగే ప్రభాస్ ‘డార్లింగ్’, రవితేజ ‘డాన్ శ్రీను’ గోపీచంద్ ‘గోలీమార్’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా వున్నారు. పరిశ్రమంతా కళ కళలాడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని, పరిశ్రమ పచ్చగా కళ కళలాడాలని కోరుకుందాం!



0 comments:
Post a Comment